మునుపటి నా మాట
బప్పా అంటే తండ్రి. బాబా అని కూడా అన వచ్చు. హిందీలో బాప్, గుజరాతీ లో బాపు, మరాఠీలో బప్పా, ఒరియా లో బొప్పా అంటారు. అయితే మహారాష్ట్రలో మాత్రమే వినపడే ‘గణపతి బప్పా మోరయా’ వంటి నినాదం ఇప్పటి మాధ్యమాల ధర్మమా అని ఆంధ్రలోనూ వినబడుతోంది. ‘పుడ్చా వర్షా లౌకర్ యా’ అనే మరో నినాదం కూడా ఉంది. చవితి నుంచి పది రోజుల వరకు ఉత్సాహంగా ఉత్సవాలు జరుపు కొన్నాక విగ్రహ నిమజ్జన సమయంలో గణపతి దేవుణ్ణి మళ్ళీ ఏడాది మరలి రమ్మంటూ జనం పలికే జేజేలు అది. లోకమాన్య బాల గంగాధర్ తిళక్ స్వాతంత్ర్య పోరాట సమయంలో పుణేలో ‘సామూహిక గణేష్ ఉత్సవాలు ఆచరించుదాం రండి' అని ఇచ్చిన పిలుపు నేటికీ మాన్యతని పొంది యావత్ మహారాష్ట్ర ఆదరించి ఆనందించే ఒక సదాచారంగా మారింది. మహారాష్ట్రలో సాధారణంగా ఏ ముఖ్యమైన పండుగ కైనా అయిదు రోజులు కేటాయిస్తారు. ఉదాహరణకి - హోలీ పండుగ . ఇది పౌర్ణమికి వస్తుంది కనుక అక్కడినుంచి వచ్చే అయిదవ రోజుని ‘రంగ్ పంచమి’ గా ఆచరిస్తారు. ఆ రోజూ హోలీ నాటిలా రంగులు చల్లుకున్నా అది కేవలం వ్యక్తిగతం. బహిరంగంగా ఆడి ఇతరుల్ని ఇబ్బంది పెట్టరు. ఇక- వినాయక చవితి తరువాత వచ్చే మూడవ తిథిని గౌరీ ఆవాహనం, నాలుగవ తిథిని గౌరీ పూజ, అయిదవ తిథిని గౌరీ విసర్జనం వంటి కార్య క్రమం తప్పక పాటించి పురాణ కథకి జీవం పోస్తారు. తనయుడితో పాటు తల్లినీ స్మరించడం ఎంత గొప్పది! చెప్పాలంటే - మహారాష్ట్రీయుల కుల దైవం గణపతి. అంతే కాదు ప్రతి కుటుంబానికి వేరుగా ఒక ఆధ్యాత్మిక గురువు కూడా ఉంటారు. ప్రతి శుభ కార్యానికీ గణపతితో పాటు వారి వారి గురు దీవెనలు కూడా కోరుకుంటారు. గణపతి అంటే గణాధిపతి, శివుని ప్రమథ గణాల వేలుపు కనుక గణేశుడు. హ్రస్వంగా ‘గణేష్’ అంటున్నాం. భాద్రపద శుక్ల (శుద్ధ) చతుర్ధి (చవితి) తిథిలో గణపతి ఆవిర్భావం జరిగింది. ఈ యేడు (2012) మనకి రెండు భాద్రపదాలు వచ్చాయి. ముందు వచ్చి వెళ్ళిపోయినది అధిక భాద్రపదం. అధిక మాసం అని మనం అంటాం. ఉత్తరాన మల్ మాస్/మాహ్ అంటారు.
0 Comments
భాద్రపద మాసం, శుద్ధ చవితి తిథి అంటే ‘వినాయక చవితి‘ మనకి. భాద్రపద శుక్ల చతుర్థి – శ్రీ గణేష్ చతుర్థి మహారాష్ట్రలో. ప్రతి మాసం శుక్ల పక్షంలో వచ్చే నాల్గవ తిథి- చతుర్థి-ని వినాయక చతుర్థి అంటారక్కడ. ప్రతి నెలా బహుళ (కృష్ణ) పక్షంలో వచ్చే చతుర్థిని ‘సంకష్ట’ చతుర్థి అంటారు. శ్రావణ మాసం శుక్ల చతుర్థిని వినాయక నాగ చతుర్థి అంటారు. ఎందుకంటే ఆ మర్నాడు పంచమి నాడు ‘నాగ పంచమి’ కనుక. ఎడమ వైపు మీరు చూస్తున్న గణపతి పుణే లోని ప్రసిద్ధ దగ్డూ షేట్గణపతి మందిర మూర్తి. భాద్రపద శుక్ల చతుర్థి నాడు చంద్ర దర్శనం నిషేధం. ఆకాశంలో నెలవంక ఇలవంక కవ్వించే రీతిలో చూస్తుంటే అప్రయత్నంగానే చూస్తాం. అయ్యో నిందలేనా అని ఆనక ఘొల్లుమంటాం. పాపం ఈ బోటు ఆకారం లో ఆకాశ నదిలో విహరించే చంద్రుడి బోటి వారికి శాపమేమిటో? అవును మరి- అంత పెద్ద బొజ్జతో గణపతి దర్శనమయ్యే సరికి శివుడి సిగలో హాయిగా కూర్చున్న ఈ బక్కపలచ వాడికి నవ్వొచ్చింది. అంతే ఫెడేల్న అంబ శపించింది. మిగతా పదకొండు నెలల్లో వచ్చే చతుర్థి నాడు జనం నిన్ను చూడొచ్చు కానీ ఒక షరతు – చూసినవారు ఉపవాసముండాలి అని పార్వతీ దేవిసవరించింది. అంతా మన మంచికేనేమో! ఆ రకంగా నెలకో మారు ఉపవాసముంటే ఆరోగ్యానికి మంచిదే. అసలు ఈ చవితి నాడు వినాయకుడు పుట్టాడా? కాదు. ప్రథమ పూజ పొందగలిగే ఏకైక వ్యక్తిగా, దైవిక శక్తిగా శివుడుగణపతిని ప్రకటించిన రోజు. గణపతి అనగానే తెలుస్తోంది- గణాలన్నిటికి అధిపతి అని. అందుకే మహా గణపతి కూడా. గణేశుడు- అంటే గణాల ఈశుడు. గణాల దేవుడు. ఏ పూజకైనా తొలి నామ పఠనం గణేష్ దే కనుక ‘ప్రధమేష్’ అయ్యాడు. |
Quick Linksపాటల కొలువు
అచ్చం అవే 'అచ్చు'లు చిరునవ్వులోని హాయి ఆహా ... ఆహహా Archives
December 2013
Categories
All
|